1"సహోదరులారా, తండ్రీలారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము ఆలకించుడి."
2అతడు హెబ్రీ భాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా నుండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను.
3"నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్టయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తునై యుండి,"
4ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.
5"ఇందును గూర్చి ప్రధాన యాజకులును, పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని."
6"నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు, మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను."
7"నేను నేలమీద పడి - పౌలా, పౌలా, నీవెందుకు నన్ను హింసించు చున్నావని నాతో నొక స్వరము పలుకుట వింటిని."
8"అందుకు నేను - ప్రభువా, నీవెవరవని అడిగినప్పుడు; ఆయన - నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను."
9నాతో కూడ ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరమును వారు వినలేదు.
10"అప్పుడు నేను - ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువునీవడు లేచి దమస్కులోనిని వెళ్లుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను."
11ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేక పోయినందున నాతో కూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిమి.
12"అంతట ధర్మశాస్త్రముచొప్పున భక్తిపరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడైన అననీయ అనువాడొకు నా యొద్దకు వచ్చి నిలిచి -"
13"పౌలా, సహోదరుడా, దృష్టి పొందుమని నాతో చెప్పగా, ఆ ఘడియలోనే నేను దృష్టిపొంది అతని చూచితిని."
14"అప్పుడతడు - మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి యున్నాడు."
15నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల యెదుట ఆయనకు సాక్షివైయుందువు.
16గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను.
17అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని.
18అప్పుడాయన - నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను.
19"అందుకు నేను - ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు ఉంటినని వారికి బాగుగా తెలియును."
20మరియు నీ సాక్షియైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.
21"అందుకు ఆయన - వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను."
22ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుకతగడు. భూమి మీద ఉండకుండ చంపివేయుడని కేకలు వేసిరి.
23"వారు కేకలు వేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయుచుండగా,"
24"వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించెను."
25వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి - శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడా లతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని అడిగెను.
26శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి - నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను.
27అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి - నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా-
28అతడు - అవునని చెప్పెను. సహస్రాధిపతి - నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకొంటిననెను; అందుకు పౌలు - నేనైతే పుట్టుకతోనే రోమీయుడననెను.
29కాబట్టి అతని విమర్శింపబోయినవారు వెంటనే అతనిని విడిచి పెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొనినప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడ భయపడెను.
30"మరునాడు, యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొన గోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభ వారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసుకొని వచ్చి వారి యెదుట నిలువబెట్టెను."