అపొస్తలుల కార్యములు 26:1-32 TBO1970 - Bible AI

1అగ్రిప్ప పౌలును చూచి - నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఈలాగు సమాధానము చెప్పసాగెను -

2"అగ్రిప్ప రాజా, తమరు యూదులలో నుండు సమస్తమైన ఆచారములను, వివాదములను విశేషముగా నెరిగినవారు గనుక,"

3యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి యెదుట సమాధానము చెప్పుకొన బోవుచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను.

4మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు.

5"వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారి కిష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు."

6ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.

7"మన పన్నెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపియున్నారు."

8దేవుడు మృతులను లేపు నను సంగతి నమ్మతగనిదని మీరేల ఎంచుచున్నారు?

9నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని.

10"యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధానయాజకుల వలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని."

11"అనేక పర్యాయములు, సమాజమందిరములన్నినిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని."

12"అందునిమిత్తము నేను ప్రధానయాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా,"

13"రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును, నాతో కూడ వచ్చిన వారి చుట్టును ఆకాశము నుండి సూర్యతేజస్సు కంటె మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని."

14"మేమందరమును నేల పడినప్పుడు - పౌలా, పౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు యెదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని."

15"అప్పుడు నేను - ప్రభువా, నీవెవరవని అడుగగా; ప్రభువు - నేను నీవు హింసించుచున్న యేసును,"

16నీవు నన్ను చూచి యున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి యున్నాను.

17నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము; నేను ఈ ప్రజలవలనను అన్యజనుల వలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;

18"వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను."

19"కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక,"

20"మొదట దమస్కులోని వారికిని, యెరూష లేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని."

21ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి.

22అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని; - క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజను లకును వెలుగు ప్రచురింపబోవునని

23"ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని."

24"అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా, ఫేస్తు - పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్య వలన నీకు వెఱ్ఱి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను."

25"అందుకు పౌలు ఇట్లనెను - మహా ఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కాను గాని, సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను."

26రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను.; వాటిలో ఒకటియు అతనికి మరుగై యుండలేదని రూఢిగా నమ్ముచున్నాను.; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు.

27"అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును."

28అందుకు అగ్రిప్ప - ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయచుచున్నావే అని పౌలుతో చెప్పెను.

29"అందుకు పౌలు - సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప, నా వలె నుండునట్లు దేవుడనుగ్రహించు గాక అనెను."

30"అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడ కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి,"

31"ఈ మనుష్యుడు మరణమునకైనను, బంధకమునకైనను తగిన దేమియు చేయలేదని తమలో తాము మాటలాడుకొనిరి."

32అందుకు అగ్రిప్ప - ఈ మనుష్యుడు కైసరు యెదుట చెప్పుకొందునని అనని యెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.

>