కీర్తనలు 38:1-22 TBO1970 - Bible AI

1"యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము."

2నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది.

3నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.

4నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి.

5నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.

6నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.

7నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు.

8నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను

9"ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు."

10నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను.

11నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు

12నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డు చున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్ను చున్నారు.

13చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.

14నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.

15"యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను."

16"ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక."

17నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.

18నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను.

19నా శత్రువులు చురుకైనవారును బలవంతులునై యున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు.

20మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి

21"యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము."

22"రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము."