కీర్తనలు 57:1-11 TBO1970 - Bible AI

1నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చి యున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను.

2మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.

3ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును.(సెలా.)

4నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.

5"దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము."

6నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా.)

7"నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను."

8"నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను."

9నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది.

10"ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను."

11"దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము."