1"మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక, యేసుక్రీస్తు వలనను,ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును,"
2"నాతో కూడనున్న సహోదరులందరును, గలతీయలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది."
3తండ్రియైన దేవుని నుండియు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.
4మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.
5దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్.
6"క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగి పోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది."
7"అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు."
8మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
9మేమిదివరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడలవాడు శాపగ్రస్తుడవును గాక.
10ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును.
11"సహోదరులారా,నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను."
12"మనుష్యుని వలన నేను దానిని పొందలేదు, నాకేవడును దాని బోధింపనులేదు గాని, యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది."
13"పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు,"
14"నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి."
15"ఆయినను తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని,"
16ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రదింపలేదు.
17నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.
18అటుపైన మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని.
19"అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని."
20"నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై, ఇదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు."
21"పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని."
22"క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని,"
23"మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని,"
24వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.