1"ఈ స్వాతంత్య్రము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి."
2చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజన మేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను.
3ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై యున్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగా చెప్పుచున్నాను.
4"మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరుచేయబడి యున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు."
5"ఏలయనగా, మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము."
6"యేసుక్రీస్తు నందుండువారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందక పోవుటయందేమియు లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును."
7మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను?
8ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు.
9పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును.
10మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువు నందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును.
11"సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా ?"
12మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు.
13"సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్య్రమును శారీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి."
14ధర్మశాస్త్ర మంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.
15అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన యెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపొదురేమో చూచుకొనుడి.
16"నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు."
17"శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు."
18మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు.
19"శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా- జారత్వము, అపవిత్రత, కాముకత్వము,"
20"విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,"
21"భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను."
22"అయితే ఆత్మ ఫలమేమనగా- ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వీకము, ఆశానిగ్రహము."
23ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు.
24క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.
25"మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము."
26"ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపకయు వృధాగా అతిశయపడకయు ఉందము."