ప్రకటన గ్రంథము 22:1-21 TBO1970 - Bible AI

1మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలములనది దేవుని యొక్కయు గొఱ్ఱెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను.

2ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.

3"ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొఱ్ఱెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును."

4ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్ల యందుండును.

5రాత్రి ఇక ఎన్నడును ఉండదు. దీపకాంతియైనను సూర్యకాంతి యైనను వారి కక్కర లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.

6మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను- ఈ మాటలు నమ్మకములును సత్యములునైయున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింప వలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.

7ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు.

8యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా;

9"అతడు- వద్దు సుమీ, నేను నీతోను ప్రవక్తలైన నీ సహాదరుల తోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను."

10మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను - ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు; కాలము సమీపమై యున్నది.

11"అన్యాయము చేయువాడు యింకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతి మంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడు గానే యుండనిమ్ము."

12ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

13"నేనే అల్పాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను."

14"జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు."

15కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

16"సంఘములకోసరము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను."

17ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిని వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

18"ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా-ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;"

19"ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును."

20"ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు-అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్;"

21"ప్రభువైన యేసూ, రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్."

ticle>