1అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి
2"అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను, అతని అన్నదమ్ములను కనెను."
3"యూదా తామారు నందు పెరెసును, జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను;"
4"ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మి నాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను."
5"నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,"
6యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను.
7"సొలొమోను రెహబామును కనెను, రెహాబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను."
8"ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను."
9"ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను"
10"హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను;"
11యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను.
12"బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను,"
13"జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోరును కనెను,"
14ఆజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను ఆకీము ఎలీహూదును కనెను.
15"ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను."
16"యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను."
17ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు.
18యేసుక్రీస్తు జననవిధ మెట్లనగా- ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను.
19ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపర్చనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ నుద్దేశించెను.
20"అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై- ''దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది."
21ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు (రక్షకుడు) అను పేరు పెట్టుదువనెను.
22"''ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కనును; ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టును'' (యెషయా 7:14)"
23అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదియంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
24"యోసేపు నిద్ర మేల్కొని ప్రభువుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని"
25ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.