మత్తయి సువార్త 18:1-35 TBO1970 - Bible AI

1"ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోకరాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా,"

2ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువ బెట్టి ఇట్లనెను -

3''మీరు మార్పు నొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

4కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొను వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు.

5మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును.

6"నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతర పరచిన వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై, మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు.''"

7''అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ.

8కాగా నీ చేయియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరచినయెడల దానిని నరికి నీ యొద్దనుండి పారవేయుము. రెండు చేతులును రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటె కుంటివాడివిగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మంచిది.

9నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేయుము. రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకములో పారవేయబడుట కంటె ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు.

10ఈ చిన్నవారిలో ఒకనినైన తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు పరలోక మందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోక మందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను''

11"మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా,"

12"వాటిలో నొకటి తప్పిపోయిన యెడల, తొంబది తొమ్మిదింటిని కొండల మీద విడచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా ?"

13వాడు దాని కనుగొనినయెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలను గూర్చి సంతోషించుట కంటె దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

14ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు.''

15''నీ సహోదరుడు నీ యెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన యెడల నీవతనిని సంపాదించు కొంటివి.

16అతడు వినని యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము.

17అతడు వారి మాటయు వినని యెడల ఆ సంగతి సంఘమునకు తెలియ జెప్పుము. అతడు సంఘపు మాటయు వినని యెడల అతనిని నీకు అన్యుని గాను సుంకరుని గాను ఎంచుకొనుము.

18మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

19మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చియైనను భూమిమీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.

20ఏలయనగా ఎక్కడ యిద్దరు ముగ్గురు నా నామమందు కూడి యుందురో అక్కడ నేను వారి మధ్య నుండెదను'' అని చెప్పెను.

21"ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి - ''ప్రభువా, నా సహోదరుడెవరైన నా యెడల తప్పిదము చేసిన యెడల నేనెన్ని మారులతనిని క్షమించవలెను? యేడు మారులా? అని అడుగగా,"

22అందుకు యేసు - ''ఏడు మారులు మట్టుకే గాదు డెబ్బదిఏడు మార్లు అయినా క్షమించవలెను.

23కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది.

24అతడు లెక్కచూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అప్పు వున్న యొకతని యొద్దకు తేబడెను.

25"అప్పుతీర్చుటకు వాని యొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను."

26"కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి, మ్రొక్కి, నా యెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా,"

27"ఆ దాసుని యజమానుడు ఆ దాసునిపై కనికరపడి, వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను."

28"అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసుని చూచి, వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి యున్నది చెల్లింపుమనెను."

29"అందుకతని తోడి దాసుడు సాగిలపడి, నా యెడల ఓర్చుకొనుము. నీకు చెల్లించెదనని వేడుకొనెను గాని"

30వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను.

31"కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుః ఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా చెప్పగా,"

32"ఆ యజమానుడు వానిని పిలిపించి, ''చెడ్ఢ దాసుడ, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయును నేను క్షమించితిని."

33నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి యుండెను గదా'' అని వానితో చెప్పెను.

34అందుచేత యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు హింసించువారికి అతని అప్పగించెను.

35మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని యెడల నా పరలోకపు తండ్రియు మీయెడల ఆ ప్రకారమే చేయును''.

ticle>