1''మీరు తీర్పు తీర్చకుడి. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును.
2మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును.
3నీ కంటిలో నున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుటయేల ?
4నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి - నీ కంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?
5"వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును."
6"పరిశుద్ధ మైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల యెదుట వేయకుడి; వేసిన యెడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి, మీ మీద పడి మిమ్మును చీల్చివేయును''"
7"''అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును,"
8"తట్టుడి మీకు తీయబడును. | అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టు ప్రతివానికి తీయబడును."
9మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన యెడల వానికి రాతి నిచ్చునా ?
10చేపను అడిగిన యెడల పాము నిచ్చునా ?
11మీరు చెడ్ఢవారైయుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంత కంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును.''
12''కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది.
13ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెల్పును ఆ దారి విశాలమునై యున్నది. దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు.
14జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది. దాని కనుగొనువారు కొందరే.''
15''అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీ యొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
16"వారి ఫలముల వలన మీరు వారిని తెలిసి కొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లకు అంజూరపు పండ్లనైనను కోయుదురా?"
17"అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును.!"
18"మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు."
19మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
20కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
21"ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును."
22"ఆ దినమందు అనేకులు నన్ను చూచి-ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు."
23"అప్పుడు -నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును."
24కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.!
25"వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటి మీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు."
26మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
27"వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను."
28యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్య పడుచుండిరి.
29ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.