మార్కు సువార్త 8:1-38 TBO1970 - Bible AI

1"ఆ దినములలో మరియొకసారి బహుజనులు కూడి రాగా వారికి తినుటకు ఏమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి,"

2''జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ద నున్నారు. వారికి తిననేమియు లేనందువలన నేను వారి మీద కనికర పడుచున్నాను.

3నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్చపోవుదురు; వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారు'' అని వారితో చెప్పెను.

4అందుకాయన శిష్యులు - ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తి పరచగలడని ఆయననడిగిరి.

5"ఆయన- మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా, వారు- ఏడనిరి."

6"అప్పుడాయన - ''నేలమీద కూర్చుండుడి'' అని జనుల కాజ్ఞాపించి, ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి."

7కొన్ని చిన్న చేపలు కూడ వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడ వడ్డించుడని చెప్పెను.

8వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.

9భోజనము చేసినవారు యించుమించు నాలుగు వేలమంది. వారిని పంపివేసిన వెంటనే

10ఆయన తన శిష్యులతో కూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతమునకు వచ్చెను.

11అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి.

12"ఆయన ఆత్మ యందు పెద్ద నిట్టూర్పు విడిచి ''ఈ తరము వారు ఎందుకు ఏ సూచకక్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని'' చెప్పి,"

13వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను.

14వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మరచిరి; దోనెలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను

15"ఆయన- చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా,"

16వారు తమయొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి.

17యేసు అది యెరిగి - ''మన యొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించు కొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారైయున్నారా?

18మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసుకొనరా?

19నేను ఆ అయిదు వేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచె పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండఎత్తితిరి ?'' అని వారి నడిగెను. వారు- పన్నెండని ఆయనతో చెప్పిరి.

20''ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచి పెట్టినపుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరి ?'' అని ఆయన అడుగగా వారు- ఏడనిరి.

21అందుకాయన ''మీరింకను గ్రహింపకున్నారా ?'' అని అడిగెను.

22"అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి, అప్పుడక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొని వచ్చి, వానిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి."

23"ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకుని పోయి, వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులంచి - ''నీకేమైనను కనబడుచున్నాదా ?'' అని వాని నడగుగా,"

24వాడు- కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను

25"అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా, వాడు, తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను."

26అప్పుడు యేసు ''నీవు ఊరిలోనికి వెళ్ళవద్దు'' అని చెప్పి వానిని వాని యింటికి పంపివేసెను.

27యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలు దేరెను. మార్గములో నుండగా ''నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు?'' అని తన శిష్యుల నడిగెను.

28"అందుకు వారు - కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు మరి కొందరు ప్రవక్తలలో ఒక నియు చెప్పుకొనుచున్నారనిరి."

29"అందుకాయన- ''మీరైతే నేనెవడనని చెప్పుచున్నారు'' అని వారి నడుగగా, పేతురు - నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను."

30అప్పుడు ''తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోను చెప్పవద్దు'' అని ఆయన వారికి ఖండితముగా చెప్పెను.

31''మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యము'' అని ఆయన వారికి బోధింప నారంభించెను.

32ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింప సాగెను.

33"అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి, వారిని చూచి - ''సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావు'' అని పేతురును గద్దించెను. తన్ను తాను ఉపేక్షించుకొనవలెనని యేసు హెచ్చరించుట"

34అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి ''నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలెను.

35తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టు కొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును.

36ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వాని కేమీ ప్రయోజనము ?

37మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?

38వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడ వచ్చునప్పుడు సిగ్గుపడును'' అని చెప్పెను.

icle>