యాకోబు 2:1-26 TBO1970 - Bible AI

1"నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటముగలవారై యుండకుడి."

2"ఏలాగనగా, బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజ మందిరము లోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన యెడల,"

3"మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి - నీవిక్కడ మంచి స్ధలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో - నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండు మని చెప్పిన యెడల."

4మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసిన వారగుదురు కారా?

5"నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?"

6అయితే మీరు దరిద్రులను అవమాన పరచుదురు. ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా?

7మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా?

8మెట్టుకు నీవలె నీ పొరుగు వాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు.

9మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.

10"ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును;"

11వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయములో నపరాధివైతివి.

12స్వాతంత్య్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగుననే ప్రవర్తించుడి.

13కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పు మించి అతిశయపడును.

14"నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?"

15"సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక యున్నప్పుడు,"

16"మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక - సమాధానముగా వెళ్లుడి, చలికాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము?"

17అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును.

18"అయితే ఒకడు - నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును."

19దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.

20"వ్యర్థు, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నవా?"

21మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?

22"విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా?"

23కాబట్టి - అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను.

24"మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీని వలన గ్రహించితిరి."

25అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపి వేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా?

26ప్రాణములేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.

© 1970 Kitabı Mukaddes Şirketi
iv>