1యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని
2"యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాకమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాప పడి కీడుచేయక మానుదునని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని."
3"నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను."
4అందుకు యెహోవా - నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.
5అప్పుడు యోనా ఆ పట్టణములోనుండి పోయి దాని తూర్పుతట్టున బసచేసి అచ్చట పందిలి యొకటివేసికొని - పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని యుండగా
6దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ యిచ్చునట్లు చేసెను; ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను.
7మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను.
8మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి- బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.
9అప్పుడు దేవుడు- ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా- ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.
10అందుకు యెహోవా-నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే;
11"అయితే నూట ఇరువది వేలకంటె ఎక్కువై, కుడి యెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను."