యోహాను సువార్త 10:1-42 TBO1970 - Bible AI

1''గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు

2ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి.

3"అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును."

4మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.

5అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని వారితో అనెను.

6ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.

7కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను -

8''గొఱ్ఱెల పోవుద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు.

9"నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును."

10దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

11నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచికాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును.

12జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును; తోడేలు ఆ గొఱ్ఱెలను పట్టి చెదరగొట్టును

13జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.

14నేను గొఱ్ఱెల మంచి కాపరిని.

15"తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో, నేను తండ్రిని ఏలాగున ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును, మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను."

16"ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును."

17నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.

18ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు; దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిని'' అనెను.

19ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.

20"వారిలో అనేకులు - వాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి."

21మరికొందరు - ఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా? అనిరి.

22"ఆలయ ప్రతిష్టిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను,"

23"అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా,"

24యూదులు ఆయన చుట్టు పోగై - ఎంత కాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.

25"అందుకు యేసు - ''మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి."

26అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు.

27"నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును."

28"నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు."

29వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు;

30నేనును తండ్రియును ఏకమైయున్నాము'' అని వారితో చెప్పెను.

31"యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లు చేత పట్టుకొనగా,"

32యేసు- ''తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు'' అని వారినడిగెను.

33అందుకు యూదులు - నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.

34అందుకు యేసు - ''మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి యుండలేదా?

35"లేఖనము నిరర్థకము కానేరదు గదా; దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల - నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,"

36తండ్రి ప్రతిష్టచేసి ఈ లోకములోనికి పంపినవానితో - నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?

37"నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,"

38"చేసిన యెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును, నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడి'' అని వారితో చెప్పెను."

39వారు మరల ఆయనను పట్టుకొనచూచిరిగాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.

40యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మ మిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను.

41అనేకులు ఆయన యొద్దకు వచ్చి - యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైనవనిరి.

42అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.

ticle>