యోహాను సువార్త 11:1-57 TBO1970 - Bible AI

1మరియ ఆమె సహోదరియైన మార్త అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను.

2ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.

3"అతని అక్కచెల్లెండ్రు - ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి."

4యేసు అది విని - ''ఈ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినది'' అనెను.

5యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.

6అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.

7అటు పిమ్మట ఆయన - మనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా.

8ఆయన శిష్యులు బోధకుడా యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.

9అందుకు యేసు - ''పగలు పండ్రెండు గంటలున్నవి గదా; ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుప డడు.

10అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన యెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడును'' అని చెప్పెను.

11"ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత - మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా,"

12"శిష్యులు - ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి."

13యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.

14"కావున యేసు - ''లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను;"

15అయినను అతని యొద్దకు మనము వెళ్లుదము రండి'' అని స్పష్టముగా వారితో చెప్పెను.

16అందుకు దిదుమ అనబడిన తోమా - ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.

17యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.

18"బేతనియ యెరూషలేమునకు సమీపమైయుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము,"

19గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.

20"మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని, మరియ యింటిలో కూర్చుండియుండెను."

21"మార్త యేసుతో - ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును."

22ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని ఎరుగుదుననెను.

23"యేసు - ''నీ సహోదరుడు మరల లేచును'' అని ఆమెతో చెప్పగా,"

24మార్త ఆయనతో - అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను.

25అందుకు యేసు - ''పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;

26బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాటను నమ్ముచున్నావా?'' అని ఆమెను నడిగెను.

27"ఆమె - అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను."

28ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి - బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను.

29ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.

30"యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను."

31"గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి."

32"అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదముల మీద పడి - ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను."

33"ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు, యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు - ''అతనినెక్కడ నుంచితిరి'' అని అడుగగా,"

34"వారు - ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి."

35యేసు కన్నీళ్లు విడిచెను.

36కాబట్టి యూదులు - అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.

37"వారిలో కొందరు - ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన ఈయన, ఇతనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి."

38"యేసు మరలా తనలో మూలుగుచూ సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను."

39"యేసు - ''రాయి తీసివేయుడి'' అని చెప్పగా, చనిపోయిన వాని సహోదరియైన మార్త - ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను."

40అందుకు యేసు - ''నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా?'' అని ఆమెతో అనెను;

41"అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి - ''తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను."

42నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గానీ నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిని'' అనెను.

43"ఆయన ఆలాగు చెప్పి - ''లాజరూ, బయటికి రమ్ము'' అని బిగ్గరగా చెప్పగా,"

44"చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు - మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను."

45"కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి కాని,"

46వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి.

47కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహాసభను సమకూర్చి - మనమేమి చేయు చున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.

48మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండిన యెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.

49అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైయుండి - మీకేమియు తెలియదు.

50మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.

51తనంతట తానే ఈలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక

52"యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను."

53కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి.

54"కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతో కూడ ఉండెను."

55మరియు యూదులు పస్కా పండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి.

56వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి - మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

57ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్నయెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించియుండిరి.

ticle>