1ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.
2"ఆయన శిష్యులు - బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడ, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా,"
3"యేసు - ''వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను."
4"పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయు చుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు."
5నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును'' అని చెప్పెను.
6"ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నుల మీద ఆ బురద పూసి,"
7''నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుము'' అని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను.
8"కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకు ముందు చూచినవారును - వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా? అనిరి."
9"వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకని మరికొందరును అనిరి; వాడైతే - నేనేయనెను."
10"వారు - నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా,"
11వాడు - యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.
12"వారు - ఆయన ఎక్కడనని అడుగగా, వాడు - నేనెరుగననెను."
13అంతకుముందు గ్రుడ్డియైయుండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసికొనిపోయిరి.
14యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము.
15"వాడేలాగు చూపుపొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడ వానిని మరలా అడుగగా, వాడు - నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగకొని చూపు పొందితినని వారితో చెప్పెను."
16కాగా పరిసయ్యులలో కొందరు - ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు - పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియలేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.
17"కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతిని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, వాడు - ఆయన ఒక ప్రవక్త అనెను."
18"వాడు గ్రుడ్డివాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తల్లిదండ్రులను పిలిపించి, -"
19గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి.
20అందుకు వాని తలిదండ్రులు - వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము.
21"ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో ఎరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పకొనగలడని వారితో అనిరి."
22వాని తలిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన యెడల వానిని సమాజమందిరములోనుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని యుండిరి.
23కావున వాని తలిదండ్రులు - వాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.
24"కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి - దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా,"
25వాడు - ఆయన పాపియో కాడో నేనెరుగును; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాననెను.
26"అందుకు వారు - ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా,"
27వాడు - ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి? అని వారితో అనెను.
28"అందుకు వారు - నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;"
29దేవుడు మోషేతో మాటలాడెనని ఎరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.
30అందుకు ఆ మనుష్యుడు - ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.
31దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడైయుండి ఆయన చిత్తముచొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును.
32పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.
33ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.
34"అందుకు వారు - నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి."
35పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని - ''నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచు చున్నావా?'' అని అడిగెను.
36"అందుకు వాడు - ఫ్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా,"
37యేసు -'' నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను.''
38"అంతట వాడు - ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను."
39"అప్పుడు యేసు -'' చూడనివారు చూడవలెను, చూచువాడు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితిని'' అని చెప్పెను."
40ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని - మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.
41అందుకు యేసు - ''మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని- చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నది'' అని చెప్పెను.