సామెతలు 24:1-34 TBO1970 - Bible AI

1దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము

2వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును.

3జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును.

4తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును.

5జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.

6వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము

7మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు.

8కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును.

9మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు.

10శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.

11చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?

12ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహిం చును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.

13"నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా."

14నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.

15"భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము."

16నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.

17నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము.

18యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.

19దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము.

20దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరి పోవును

21"నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము."

22అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును?

23ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు

24నీయందు దోషములేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టివానియందు అసహ్యపడుదురు.

25న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.

26సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును.

27బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొల ములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.

28నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుక కుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?

29వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెద నను కొనకుము.

30సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా

31ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి యుండెను.దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను.

32నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని.

33ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట

34వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.

© 1970 Kitabı Mukaddes Şirketi
/div>