హెబ్రీయులకు 8:1-13 TBO1970 - Bible AI

1మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా- మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు.

2"ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైయుండి, పరలోక మందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయెను."

3ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకై నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము.

4ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమి మీద నున్న యెడల యాజకుడై యుండు.

5మోషే గుడారము అమర్చబోయినప్పుడు - కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారము నందు సేవ చేయుదురు.

6ఈయన యైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొందియున్నాడు.

7"ఏలయనగా, ఈ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశముండ నేరదు."

8"అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు - ప్రభువు ఇట్లనెను - ఇదిగోయొక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా యింటి వారి తోను నేను క్రొత్త నిబంధన చేయుదును."

9అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.

10"ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు యింటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా- వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు."

11"వారిలో ఎవడును - ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలుసుకొందురు."

12నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

13ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగి పోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది.

e>