1 కొరింథీయులకు 10:1-33 TBO1970 - Bible AI

1"సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడిచిపోయిరి."

2అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి.

3అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి.

4అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే.

5అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.

6వారు ఆశించిన ప్రకారము మనము చెడ్ఢవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.

7జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి.

8మరియు వారివలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరువది మూడు వేలమంది కూలిరి.

9మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.

10మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.

11ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.

12తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.

13సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.

14"కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి."

15బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి.

16మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే గదా?

17మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము.

18శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?

19"ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన యున్నదనియైనను, విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?"

20"లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకిష్టము లేదు."

21"మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు, ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదనున్న దాని లోను కూడ పాలుపొందనేరరు."

22ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?

23అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.

24ఎవడును తన కొరకే గాదు ఎదుటి వాని కొరకు మేలు చేయచూచుకొనవలెను.

25మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దానిని తిన వచ్చును.

26భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై యున్నవి.

27అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినపుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దాని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.

28"అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన యెడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును, మనస్సాక్షి నిమిత్తమును తినకుడి."

29మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము గాదు. ఎదుటివానిని మనస్సాక్షి నిమిత్తమే ఈలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్య్ర విషయములో తీర్పు తీర్చబడనేల?

30నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేల?

31కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.

32"యూదులకైనను, గ్రీసు దేశస్తులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి."

33"ఈలాగు నేనుకూడ స్వప్రయోజనము కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను."

ticle>