1 కొరింథీయులకు 2:1-16 TBO1970 - Bible AI

1"సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను."

2"నేను, యేసుక్రీస్తును అనగా, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నేను మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని."

3మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీ యొద్ద నుంటిని.

4"మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసుకొనియుండవలెనని,"

5"నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమగు తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు, దేవుని శక్తియు, కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని."

6"పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోకజ్ఞానము కాదు. నిరర్థకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని,"

7"దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై యుండెను. జగదుత్పత్తికి ముందుగానే, దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను."

8"అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసియుండిన యెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి యుందురు."

9"ఇందును గూర్చి- దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడియున్నది."

10"మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి యున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు."

11ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరిఎవనికినీ తెలియవు.

12"దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై, మనము లౌకికాత్మను కాక, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము."

13"మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము."

14ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

15ఆత్మ సంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు.

16ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము.

icle>