1 కొరింథీయులకు 9:1-27 TBO1970 - Bible AI

1నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా?

2ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా?

3నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే -

4తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా?

5"తక్కిన అపొస్తలులవలెను, ప్రభువు యొక్క సహోదరులవలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా?"

6మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా?

7ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు?

8ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడ వీటిని చెప్పుచున్నది గదా?

9కళ్ళము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించు చున్నాడా?

10"కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును. మనకొరకే గదా ఈ మాటలు వ్రాయబడెను. ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను. కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను."

11మీకొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి యుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా?

12ఇతరులకు మీపైని ఈ అధికారంలో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించు కొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయుకుండుటకై అన్నిటిని సహించు చున్నాము.

13"ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని యుండువారు బలిపీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా?"

14ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి యున్నాడు.

15నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నా యెడల ఈలాగున జరుపవలెనని ఈ సంగతులను వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుట కంటె నాకు మరణమే మేలు.

16నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడియున్నది. అయ్యో! నేను సువార్తను ప్రకటింపక పోయిన యెడల నాకు శ్రమ.

17ఇది నేనిష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరకును. ఇష్టపడక పోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.

18అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము.

19"నేను అందరి విషయమై స్వతంత్రుడనై యున్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై, అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని."

20"యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించు కొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాక పోయినను, ధర్మశాస్త్రమునకు లోబడిన వానివలె ఉంటిని."

21"దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను కాని, క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె నుంటిని."

22"బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని, అందరికి అన్నివిధములవాడనై యున్నాను."

23మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.

24పందెపురంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.

25"మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము."

26కాబట్టి నేను గురిచూడనివాని వలె పరుగెత్తువాడను కాను.

27గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరచు కొనుచున్నాను.

icle>