2 కొరింథీయులకు 8:1-24 TBO1970 - Bible AI

1"సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము."

2"ఏలాగనగా, వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించితిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను."

3"ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను,"

4మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్య మిచ్చుచున్నాను.

5"ఇదియు గాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తము వలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేమనుకొనలేదు."

6కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతనిని వేడుకొంటిమి.

7"మీరు ప్రతివిషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తయందును, మీకు మాయెడల నున్న ప్రేమయందును, ఏలాగు అభివృద్ధి పొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి."

8ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు. ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.

9"మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను."

10ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట యందే కాక చేయతల పెట్టుటయందు కూడ మొదటి వారై యుండిన మీకు మేలు.

11కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఏలాగు కలిగెనో ఆలాగే మీ కలిమి కొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి.

12"మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికిమించి కాదు గాని, కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును."

13"ఇతరులకు తేలిక గాను, మీకు భారముగాను యుండవలెనని ఇది చెప్పుటలేదు గాని,"

14"హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము, అందరికి సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును,"

15"మరియొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై యుండవలెనని, ఈలాగు చెప్పుచున్నాను."

16మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము.

17"అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని, అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరివచ్చుచున్నాడు."

18మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడ పంపుచున్నాము.

19"అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్థమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై, వరిచారకులమైన మాతో కూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములు వారతనిని ఏర్పరచు కొనిరి."

20"మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై, పరిచారకులమై యున్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము."

21"ఏలయనగా, ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించు కొనుచున్నాము."

22"మరియు వారితో కూడ మేము మా సహోదరుని పంపుచున్నాము. చాల సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు, ఇప్పుడును మీ యెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మికవలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలిసి కొనియున్నాము."

23"తీతు ఎవరని ఎవరైనా అడిగినయెడల, అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునై యున్నాడనియు మన సహోదరులెవరిని అడిగిన యెడల వారు సంఘముల దూతలును అపొస్తలులును క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను."

24కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల యెదుట కనపరచుడి.

icle>